హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ నియోజకవర్గ పరిధిలోని అర్హులైన పట్టభద్రులందరూ నవంబరు 6వ తేదీలోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లిలోని టీచర్స్ కాలనీలో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది బలమైన ఆయుధమని, పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా సామా రామ్మోహన్ రెడ్డిని అధిష్ఠానం ప్రకటించిందని తెలిపారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, న్యాయవాదులు, వైద్యులు సహా పట్టభద్రులందరి సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన మంత్రి, రాహుల్ గాంధీ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు.
నవంబర్ 6లోపు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి: పొన్నం
