Breaking News

అక్రమ నీటి వ్యాపారంపై అధికారులకు స్థానికుల ఫిర్యాదు

మూడు వాటర్ ట్యాంకర్లను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు.. అక్రమ బోర్లు, నీటి గుంతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

తెల్లాపూర్, అక్టోబర్ 31 (E6tv న్యూస్).

తెల్లాపూర్ మున్సిపాలిటీ శివారు ప్రాంతంలో అక్రమ నీటి వ్యాపారం యథేచ్ఛగా సాగుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై హైడ్రా కమిషనర్‌తో పాటు రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందజేసి, అక్రమ నీటి వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని కోరారు.

పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ శివారు ప్రాంతాల్లో అక్రమంగా నీటి బోర్లు ఏర్పాటు చేసి, పెద్దపెద్ద గుంతల్లో ప్లాస్టిక్ షీట్లు పరిచి నీటిని నిల్వ చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఈ గుంతల నుంచి మోటార్ల సహాయంతో వాటర్ ట్యాంకర్లలో నీటిని నింపి వ్యాపారం నిర్వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ విషయంపై గత అక్టోబర్ 28న రామచంద్రాపురం మండల డిప్యూటీ తహసీల్దార్‌కు, హైడ్రా కమిషనర్‌కు స్థానికులు వినతిపత్రాలు అందజేశారు. దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు అక్టోబర్ 31న తనిఖీలు నిర్వహించి మూడు నీటి ట్యాంకర్లను సీజ్ చేశారు.కేవలం ట్యాంకర్లను సీజ్ చేయడం మాత్రమే కాకుండా, అక్రమంగా ఏర్పాటు చేసిన నీటి బోర్లు, మోటార్లు, నీటి నిల్వ గుంతలను సైతం తక్షణమే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. అక్రమ నీటి వ్యాపారం నిర్వహిస్తున్న వారిని గుర్తించి, అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, హైడ్రా అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో వడ్డె రాములు, రాముచారి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *