Breaking News

అసెంబ్లీకి కేసీఆర్ దూరం: సీఎం రేవంత్‌పై హరీశ్ రావు విరుచుకుపాటు..

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలకు బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) హాజరుకావడం లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ఎల్పీ (BRSLP) సమావేశం అనంతరం మాజీ మంత్రి, సీనియర్ నేత తన్నీరు హరీశ్ రావు మీడియాకు ఈ విషయ వెల్లడించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిపక్షాలపై ఉపయోగిస్తున్న భాష, ప్రవర్తన తీవ్రంగా దిగజారాయని, అలాంటి వాతావరణం ఉన్న సభకు కేసీఆర్ రానవసరం లేదని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఏకగ్రీవంగా కోరినట్లు ఆయన తెలిపారు.

ముఖ్యమైన అంశాలు:

  • సీఎం భాషపై ఆగ్రహం:“ముఖ్యమంత్రి నిత్యం అసభ్యకరమైన, అనుచితమైన భాష వాడుతూ సభ గౌరవాన్ని దిగజారుస్తున్నారు. కేసీఆర్ ప్రాణాలు పోవాలని ప్రతిరోజూ కోరుకునే వ్యక్తి ఉన్న సభకు ఆయన వెళ్లాల్సిన అవసరం లేదు” అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
  • చారిత్రక నిదర్శనాలు: గతంలో ఎన్టీఆర్, జయలలిత, చంద్రబాబు నాయుడు వంటి అగ్రనేతలు కూడా అసెంబ్లీలో అవమానాలు ఎదురైనప్పుడు సభకు దూరంగా ఉండి, నేరుగా ప్రజల్లోకి వెళ్లే పోరాటం చేశారని.. మళ్లీ విజయం సాధించి సీఎంలుగా సభలోకి అడుగుపెట్టారని హరీశ్ గుర్తుచేశారు. కేసీఆర్ కూడా త్వరలోనే ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
  • 30 రోజులు సభ నడపాలి: సభలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కనీసం 30 రోజుల పాటు శాసనసభ సమావేశాలను నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
  • కేసీఆర్ భద్రతపై ప్రశ్నలను తప్పుబట్టిన హరీశ్: రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ భద్రతను రేవంత్ రెడ్డి ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. కనీసం వార్డు మెంబర్‌గా కూడా లేని తన సోదరుడు తిరుపతి రెడ్డికి నలుగురు గన్ మెన్లను ఇచ్చి, దాదాపు 40 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎందుకు ఖర్చు చేస్తున్నారో సీఎం సమాధానం చెప్పాలని హరీశ్ రావు నిలదీశారు.

అసెంబ్లీలో BRS లేవనెత్తనున్న ప్రధాన అంశాలు:

  1. 22ఏ నిబంధనలతో భూముల కొనుగోలు/అమ్మకాలపై ఎదురవుతున్న తీవ్ర సమస్యలు
  2. వ్యవసాయానికి విద్యుత్ కోతలు, విఫలమైన రైతు రుణమాఫీ
  3. పాలిటెక్నిక్ కళాశాలల సమస్యలు, జీఓ 97 వివాదం
  4. సింగరేణి కార్మికుల సమస్యలు
  5. ఉద్యోగుల పిఆర్‌సి (PRC), డిఏ (DA) పెండింగ్ & ఇహెచ్‌ఎస్ (EHS) పథకం వైఫల్యం
  6. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *