ఏర్గట్ల, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి).
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “నషా ముక్త్ భారత్” కార్యక్రమంలో భాగంగా ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు గంజాయి, కల్తీ కల్లు తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యం, చదువు, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల జీవితాన్ని నాశనం చేసుకునే ప్రమాదం ఉందని, విద్యార్థులు వాటికి దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని సూచించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు ప్రతిజ్ఞ చేయించారు.
“నషా ముక్త్ భారత్.. వికసిత్ భారత్” నిర్మాణంలో విద్యార్థులు, యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులు సందేశమిచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రసాద్, రాజ నరసయ్య, ప్రవీణ్ శర్మ, జ్యోతి, కృష్ణవేణి, రిషిక తదితరులు పాల్గొన్నారు.


