Breaking News

మొక్కజొన్న, సోయా కొనుగోలు కేంద్రాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలి

ఆర్మూర్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి).

మొక్కజొన్న, సోయా పంటల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం (AIUKS) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వి. ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి బి. దేవారం డిమాండ్ చేశారు.

ఆర్మూర్‌లోని కుమార్ నారాయణ భవన్‌లో AIUKS ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణలో పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ కూడా స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు అన్ని పంటలకు కనీస మద్దతు ధర (MSP) నిర్ణయిస్తామని హామీ ఇచ్చిందని, ఈ హామీల అమలుపై ప్రభుత్వాలను ప్రశ్నించారు.

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో పంటల సాగు, దిగుబడి తగ్గిందని వారు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది దళారీ వ్యాపారులు MSP ధరలకు మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నప్పటికీ, రైతులకు వెంటనే డబ్బులు చెల్లించకుండా వాయిదాలు వేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే అధికారిక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.సోయా పంటను కూడా దళారీ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని, రైతులకు కనీస పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి ఉందని AIUKS నాయకులు పేర్కొన్నారు. MSP ప్రకారం సోయాను క్వింటాల్‌కు రూ.5,708 చొప్పున కొనుగోలు చేసేలా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం C2+50 శాతం ప్రాతిపదికన అన్ని పంటలకు MSP నిర్ణయించాలని కోరారు. మరోవైపు ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, డీజిల్ ధరలు పెరగడంతో రైతులపై సాగు భారం పెరిగిందని తెలిపారు. బ్యాంకు రుణాలు సకాలంలో అందక కొంతమంది రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని, రైతుల ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.వ్యవసాయ ఇన్‌పుట్‌లు, కాంప్లెక్స్ ఎరువులు, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని AIUKS నాయకులు డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో AIUKS ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు బి. కిషన్, జిల్లా ఉపాధ్యక్షుడు యు. రాజన్న, జిల్లా కార్యదర్శి ఆకుల గంగారాం, టి. గంగాధర్, హోసన్న, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *