దమ్మాంలో SATA ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు

ఫౌమ్ హౌస్ కీపర్ కుమార్తె వివాహానికి రూ. 21,116 ఆర్థిక సహాయం

సౌదీ అరేబియాలోని దమ్మాంలో SATA ఆధ్వర్యంలో తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడగా, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు.

రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. విదేశీ గడ్డపై నివసిస్తున్నప్పటికీ తెలంగాణ సంస్కృతి, ఆచార సంప్రదాయాలను మరచిపోకుండా బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించడం విశేషంగా నిలిచింది. కుటుంబ సభ్యులు, చిన్నారులు సైతం పాల్గొని వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.

నిర్వాహకుల కృషి.. మహిళల ప్రతిభ

బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయడంలో SATA ఈవెంట్ డైరెక్టర్లు షామ్ మోహన్, శిల్పా రవి విశేష కృషి చేశారు. శ్రవణ్ కుమార్, విశాల్, సతీష్, ఓంప్రకాశ్ వేదిక అలంకరణతో పాటు ఇతర ఏర్పాట్లలో కీలక పాత్ర పోషించారు. అలంకరణలో లీనా కుమారి, బతుకమ్మల తయారీలో విజయలక్ష్మి, కవిత తమ ప్రతిభను చాటుకున్నారు. షోజన్య, దిలీప్ నృత్య ప్రదర్శనలతో వేడుకలకు మరింత కళను తీసుకొచ్చారు.

వివాహానికి ఆర్థిక సహాయం

ఈ కార్యక్రమంలో SATA కోర్ టీమ్ మానవీయతను చాటుకుంది. ఫామ్ హౌస్ కీపర్ వెంకటేష్ కుమార్తె వివాహ ఖర్చుల నిమిత్తం SATA కోర్ టీమ్ తరఫున రూ. 21,116 ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ సేవా కార్యక్రమంపై పలువురు అభినందనలు వ్యక్తం చేశారు.

SATA, TASA ప్రతినిధుల హాజరు

ఈ వేడుకల్లో ఈస్టర్న్ రీజియన్ SATA అధ్యక్షుడు తేజ పల్లెం, SATA కోర్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానం మేరకు రియాద్ SATA ఉపాధ్యక్షుడు మొహమ్మద్ నూరుద్దీన్, SATA సంయుక్త కార్యదర్శి మిధున సురేష్, TASA వ్యవస్థాపకుడు తిరుపతిస్వామి స్వర్ణ (స్వామి), SATS సభ్యులు హాజరయ్యారు.

అల్ హసా, దమ్మాం పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు తరలివచ్చి సంబరాల్లో పాల్గొన్నారు. ప్రవాస భారతీయుల మధ్య సాంస్కృతిక అనుబంధాలు, ఆత్మీయతను పెంపొందించేలా వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.

కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. విదేశాల్లోనూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు, ప్రవాస తెలుగు ప్రజల మధ్య ఐక్యతను బలోపేతం చేయడంలో ఇలాంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *