Breaking News

ఆర్మీ సైనికుడిపై దాడి కేసులో 14 మంది అరెస్ట్

14 సెల్‌ఫోన్లు, 7 ద్విచక్ర వాహనాలు, స్టీల్ చేతి కడియం స్వాధీనం

మరింత మంది నిందితుల కోసం పోలీసుల గాలింపు

మెట్‌పల్లి, అక్టోబర్ 24 (E6tv న్యూస్): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండలింగాపూర్ గ్రామంలో ఆర్మీ సైనికుడిపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి 14 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 14 సెల్‌ఫోన్లు, 7 ద్విచక్ర వాహనాలు, ఒక స్టీల్ చేతి కడియాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరికొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. వెల్లుల్ల గ్రామానికి చెందిన వన్నెల వికాస్‌పై బండలింగాపూర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గురువారం రాత్రి దాడి చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న వికాస్ స్నేహితులు సుమారు 30 మంది ఒక గుంపుగా ఏర్పడి, ద్విచక్ర వాహనాలపై అర్ధరాత్రి దాటిన తర్వాత బండలింగాపూర్ గ్రామానికి వెళ్లారు.శుక్రవారం తెల్లవారుజామున గ్రామంలోని హనుమాన్ ఆలయం సమీపంలో బతుకమ్మ ఆడుతున్న వారి పక్క నుంచి వారు వేగంగా, నిర్లక్ష్యంగా ద్విచక్ర వాహనాలపై వెళ్లారు. అక్కడే ఉన్న ఆర్మీ సైనికుడు తిగుర్ల స్వామి వారిని ప్రశ్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కొందరు ఆయనపై దాడి చేయడంతో పాటు స్టీల్ చేతి కడియంతో ముఖంపై కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో స్వామికి తీవ్ర రక్తగాయాలయ్యాయి.

బాధితుడు తిగుర్ల స్వామి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా శనివారం ఉదయం మేడిపల్లి గ్రామ శివారులోని ఇబ్రహీంపట్నం ఎక్స్‌రోడ్డు వద్ద వెల్లుల్ల గ్రామానికి చెందిన 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 14 సెల్‌ఫోన్లు, 7 ద్విచక్ర వాహనాలు, ఒక స్టీల్ చేతి కడియాన్ని స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు.

అరెస్టయిన నిందితులు వీరే..

బావు రమేష్, తుపాకుల స్వామి, బావు అఖిల్, లక్కంపల్లి కార్తీక్, మర్రి నీరజ్, లక్కంపల్లి కళ్యాణ్, ఐలేని వంశీ, కల్లూరి మహేష్, కల్లూరి వంశీ, కాంతి విశాల్, బొబ్బిలి నాగరాజ్, పోచంపల్లి సాయి, మంచాల పవన్, కల్లూరి రవి.

యువత ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి

ఈ సందర్భంగా మెట్‌పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. సురేష్ బాబు, ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ జి. నవీన్ కుమార్ మాట్లాడుతూ.. యువత అర్ధరాత్రి వేళల్లో గుంపులుగా తిరుగుతూ గొడవలకు, దాడులకు పాల్పడితే భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఉంటున్నారు అనే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.యువత చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడటం వల్ల భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు, పాస్‌పోర్టు వెరిఫికేషన్ వంటి ప్రక్రియలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. కేసులో పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు కొనసాగుతున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *