తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ
ఎల్లారెడ్డి, అక్టోబర్ 10 (E6TV న్యూస్: ప్రతినిధి)
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ, మాజీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్, మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆడపడుచుల ఐక్యతకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని భావితరాలకు అందించాలని నాయకులు ఆకాంక్షించారు. తెలంగాణ సంప్రదాయాలను కాపాడుకుంటూ, పండుగల విశిష్టతను భవిష్యత్ తరాలకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.తెలంగాణ భవన్లో నిర్వహించిన ఈ వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించగా, మహిళల ఉత్సాహం, సంప్రదాయ పాటలతో ప్రాంగణం సందడిగా మారింది.


