ప్రకృతి ఒడిలో బతుకమ్మ సందడి!

పోచారం ప్రాజెక్టు గట్టుపై పూల బతుకమ్మలు పేర్చిన చిన్నారులు.. కనువిందు చేసిన ప్రకృతి అందాలు

ఎల్లారెడ్డి, అక్టోబర్ 16 (E6tv NEWS).

తెలంగాణ ఆడపడుచుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వేళ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు వద్ద ఆహ్లాదకరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రకృతి ఒడిలో పూల బతుకమ్మలను పేర్చుతూ చిన్నారులు, యువతులు సందడి చేశారు.

పోచారం ప్రాజెక్టు పరిధిలోని పోచమ్మరాల్ గ్రామానికి చెందిన చిన్నారులు, యువతులు శుక్రవారం తెల్లవారుజామున ప్రాజెక్టు పరిసరాల్లో విరబూసిన పూలను సేకరించారు. అనంతరం ప్రాజెక్టు గట్టుపై కూర్చొని పసుపు రంగు తంగేడు పూలతో అందమైన బతుకమ్మలను పేర్చారు. ప్రకృతి అందాల నడుమ నవ్వుతూ, ఆడుతూ బతుకమ్మలను తయారు చేసుకుంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.ఓవైపు ప్రాజెక్టు నీరు, మరోవైపు పచ్చని ప్రకృతి అందాల మధ్య చిన్నారులు బతుకమ్మలను తయారు చేస్తున్న దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. అటువైపు వాకింగ్‌కు వెళ్లిన మీ 24 న్యూస్ ప్రతినిధి ఈ అందమైన దృశ్యాన్ని గమనించారు.

ప్రకృతిలో లభించే పూలతో బతుకమ్మలను తయారు చేస్తూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించిన చిన్నారుల ఉత్సాహం అందరినీ ఆకట్టుకుంది. ప్రకృతితో మమేకమై పండుగను జరుపుకోవడం తెలంగాణ పూల పండుగ ప్రత్యేకతను మరోసారి చాటిచెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *