Breaking News

పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 275 మందికి రూ.2.75 కోట్లకు పైగా ఆర్థిక సాయం

నిజామాబాద్ అర్బన్, అక్టోబర్ 11 (E6TV NEWS).

పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పేర్కొన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన 275 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.2,75,31,900 విలువైన ఆర్థిక సహాయ చెక్కులను ఆయన, ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణతో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, రాష్ట్రం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలు ఆర్థిక భారంగా మారకూడదనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో షాదీ ముబారక్ పథకం కింద 149 మంది లబ్ధిదారులకు రూ.1,49,17,284, కళ్యాణ లక్ష్మి పథకం కింద 126 మంది లబ్ధిదారులకు రూ.1,26,14,616 విలువైన చెక్కులను అందజేసినట్లు వెల్లడించారు. ఈ రెండు పథకాల ద్వారా మొత్తం 275 మంది లబ్ధిదారులకు రూ.2.75 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు చేపట్టిందని షబ్బీర్ అలీ తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ప్రజలకు ప్రయోజనం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, యువతకు ఉపాధి అవకాశాలు, సన్నబియ్యం పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో NUDA చైర్మన్ కేశ వేణు, స్థానిక కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *