Breaking News

అపూర్వ సమ్మేళనం.. చిన్ననాటి తీపి జ్ఞాపకాలను నెమరేసుకున్న పూర్వ విద్యార్థులు

25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న బ్రాహ్మణపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు.. గురువులకు ఘన సన్మానం

బ్రాహ్మణపల్లి, అక్టోబర్ 11:(E6tv NEWS).

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎవరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటే మళ్లీ బాల్యంలోకి వెళ్లినట్లే ఉంటుంది. పాఠశాల రోజుల్లో చేసిన అల్లరి పనులు, చిలిపి చేష్టలు, మధుర జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఆనందంలో మునిగిపోతారు. అలాంటి ఆత్మీయతకు అద్దం పట్టేలా కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది.

పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు సుమారు 25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకుని ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాలతో సందడి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మిత్రులు తమ చిన్ననాటి మధుర స్మృతులను గుర్తుచేసుకుంటూ ఆనందంగా గడిపారు. విద్యాభ్యాసం, వైవాహిక జీవితం, ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబ నేపథ్యాలు, పిల్లల చదువుల గురించి ఒకరికొకరు వివరాలు పంచుకున్నారు.కాలం మారినా, జీవితాల్లో ఎన్నో మార్పులు వచ్చినా చిన్ననాటి స్నేహం మాత్రం చెక్కుచెదరలేదని ఈ సమ్మేళనం మరోసారి చాటిచెప్పింది. పాఠశాలలో కలిసి చదువుకున్న రోజులను గుర్తుచేసుకుంటూ నవ్వులు, సరదా సంభాషణలతో ఆహ్లాదకర వాతావరణంలో గడిపారు. అపురూపమైన ఈ క్షణాలను తమ చరవాణుల్లో చిత్రీకరించుకుని జ్ఞాపకాలుగా భద్రపరుచుకున్నారు. అనంతరం అందరూ కలిసి ఆత్మీయ విందులో పాల్గొన్నారు.

గురువులకు ఘన సన్మానం

తమకు విద్యాబుద్ధులు నేర్పి, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు మార్గదర్శకులైన పూర్వ ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. గణితం బోధించిన హన్మంత్ రెడ్డి, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు శ్రీశైలం, సంగయ్య, హిందీ ఉపాధ్యాయురాలు విద్యా, నరసయ్య, తెలుగు ఉపాధ్యాయులు రవిశంకర్, సైన్స్ ఉపాధ్యాయులు వెంకట్ రావు, నరసింహులను శాలువాలతో సత్కరించి తమ కృతజ్ఞతను చాటుకున్నారు.

ఈ సందర్భంగా గురువులతో కలిసి పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఆనందంగా గడిపారు. గురుశిష్యుల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధం, పూర్వ విద్యార్థుల మధ్య కొనసాగుతున్న స్నేహబంధం ఈ సమ్మేళనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో బ్రాహ్మణపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *