ఇందూరు, సెప్టెంబర్ 29: (E6tv NEWS: శివ ఠాకూర్)
ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకుండా మోసం చేసిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ యాత్ర మంగళవారం నిజామాబాద్ అర్బన్‌కు చేరుకుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరంగల్ డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ సమక్షంలో రైతులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. రూ.2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా, భూమిలేని రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం, రైతులు పండించిన ప్రతి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయడం, వరి క్వింటాల్‌కు రూ.500 బోనస్ వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందన్నారు.రైతులతో పాటు మహిళలు, యువతకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. రైతులు పంటలు వేసుకున్న తర్వాత ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించడం సమంజసం కాదన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ విధానాల్లో పెద్దగా తేడా లేదని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన విధంగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ధన్పాల్ విమర్శించారు. ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళన వంటి కార్యక్రమాలకు భారీగా నిధులు ఖర్చు చేస్తూ రైతుల సమస్యలను విస్మరిస్తున్నారని అన్నారు.కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల్లో తన వాటా నిధులు అందిస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం వాటిని తామే చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని బోధన్ నుంచి జగిత్యాల వరకు 320 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, హరీష్‌రెడ్డి, సుగంధం హరీష్, పద్మారెడ్డి, కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, బంటు రాము, మల్కాయి మహేందర్, ప్రసూన శ్రీనివాస్‌రెడ్డి, బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రతినిధి స్వామి యాదవ్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వనిత, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు జస్పాల్సింగ్, యువ మోర్చా రాష్ట్ర సహ కోశాధికారి విజయ్ తదితరులు పాల్గొన్నారు.



