Breaking News

ఐదుగురు వార్డు సభ్యులపై సర్పంచ్ వివక్ష చూపుతున్నారు

ఒక సంవత్సరం నుంచి పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపణలు

రుద్రూరు, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి)

నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో ఐదుగురు వార్డు సభ్యులపై సర్పంచ్ ఇందూరి సునీత చంద్రశేఖర్ వివక్ష చూపుతున్నారని వార్డు సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట వారు విలేకరుల సమావేశం నిర్వహించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ.. గత ఏడాది కాలంగా తమ తమ వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సర్పంచ్‌కు పలుమార్లు వినతిపత్రాలు అందించినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఐదు వార్డుల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.సర్పంచ్ తమకు సంబంధించిన వార్డులు, కాలనీల్లోనే అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తున్నారని, తమ వార్డులపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ తన వైఖరిని మార్చుకోవాలని కోరారు.

అదేవిధంగా గ్రామంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సమస్యపై కూడా వార్డు సభ్యులు స్పందించారు. అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, అర్హుల జాబితాను పారదర్శకంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తహసీల్దార్ తారాబాయి, గ్రామ సర్పంచ్ నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని వారు ఆరోపించారు.ఇప్పటికైనా తమ వార్డుల్లోని ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు అర్హులైన వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల విషయంలో న్యాయం చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వార్డు సభ్యులు హెచ్చరించారు. సమావేశంలో ఐదుగురు వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *