Breaking News

పాఠశాలలకు రూ.6 లక్షల విలువైన సామగ్రి విరాళం


ముచ్కూర్, ఎర్గట్ల, పచ్చలనడ్కూడ పాఠశాలలకు సైన్స్ ల్యాబ్ మెటీరియల్
భీంగల్ కస్తూరిబా పాఠశాలకు 35 డ్యూయల్ డెస్క్ బెంచీలు

వేల్పూర్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి)

బాల్కొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సౌజన్యంతో, ఆయన వియ్యంకుడు, పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి సహకారంతో సుమారు రూ.6 లక్షల విలువైన విద్యా సామగ్రిని అందజేశారు. వేల్పూర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం ఈ సామగ్రిని ఆయా పాఠశాలల ప్రతినిధులకు అందించారు.

ముచ్కూర్, ఎర్గట్ల, పచ్చలనడ్కూడ గ్రామాల్లోని హైస్కూళ్లకు ఒక్కో పాఠశాలకు రూ.1.50 లక్షల విలువైన సైన్స్ ల్యాబ్ మెటీరియల్‌ను అందజేశారు. విద్యార్థులకు ప్రయోగాత్మక విద్యను అందించడంతో పాటు, సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించేందుకు ఈ సామగ్రి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.అదేవిధంగా భీంగల్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలకు రూ.1,46,650 విలువైన 35 డ్యూయల్ డెస్క్ బెంచీలను పాఠశాల యాజమాన్యానికి అందజేశారు.

విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ఏనుగు దయానంద్ రెడ్డి ముందుకు రావడం అభినందనీయమని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. విద్యా రంగానికి ఆయన అందిస్తున్న సహకారం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఉన్నతమైన విద్యను అందించేందుకు అవసరమైన చోట ఇకముందు కూడా తమ సహాయ సహకారాలు కొనసాగుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, పాఠశాలల ఉపాధ్యాయులు, యాజమాన్య ప్రతినిధులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *