భారీ వర్షాల కారణంగా గాడేరు డ్రెయిన్ పొంగిపొర్లడంతో కాకినాడ నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా 48, 49 డివిజన్లలోని ఇందిరమ్మ కాలనీతో పాటు అనేక ప్రాంతాలు గత మూడు రోజులుగా నీటి ముంపులోనే ఉన్నాయి. రహదారులు చెరువులను తలపిస్తుండటంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకుల కోసం కూడా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడటంతో స్థానిక జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
సాధారణ వాహనాలు వెళ్లలేని ఇందిరమ్మ కాలనీకి నగర కమిషనర్, తహసీల్దార్ సహా ఇతర అధికారులు జేసీబీపై ప్రయాణించి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిలిచిన వరద నీటిని త్వరితగతిన బయటకు పంపడమే కాకుండా, వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య చర్యలు వేగవంతం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. గాడేరు డ్రెయిన్ ప్రవాహం తగ్గితేనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అధికారులు తెలిపారు.

