Breaking News

దసరా, బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

జగిత్యాల, అక్టోబర్ 07 (E6tvNEWS: ప్రతినిధి)
దసరా నవరాత్రోత్సవాలు, సద్దుల బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని నంబి వేణుగోపాల చార్య కౌశిక కోరారు. ఈ మేరకు మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్యప్రణవ్‌ను కలిసి అవసరమైన ఏర్పాట్లపై విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 11న శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభమై, అక్టోబర్ 18న సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 20న దసరా పండుగ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలను ప్రజలు, భక్తులు ప్రశాంతంగా, ఆనందంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకునేలా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.అనంతరం జంబిగద్దె ప్రాంతాన్ని పరిశీలించిన నంబి వేణుగోపాల చార్య కౌశిక.. దేవుడి ఊరేగింపు, భక్తుల రాకపోకలకు అనుగుణంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ దసరా, బతుకమ్మ వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకునేలా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, పరిసరాల పరిశుభ్రతతో పాటు భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.

నంబి వేణుగోపాల చార్య కౌశిక ప్రజలందరూ శరన్నవరాత్రులు, సద్దుల బతుకమ్మ, దసరా పండుగలను ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ పవిత్ర పర్వదినాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను నింపాలని కోరుతూ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలిపారు.

కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు సుంకేటి మమత రామకృష్ణ రెడ్డి, పంబాల సుజాత రాము, కోరే జయ గంగమల్లు, దుమాల రాజ్‌కుమార్, పిట్ట ధర్మరాజు, చెట్టే గంగాధర్, క్యాదసు నవీన్, మాజీ కౌన్సిలర్ రేపల్లె హరికృష్ణతో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *