Breaking News

కస్టమర్లకు మల్లి షాక్ ఇచ్చిన ఎయిర్‌టెల్.

ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తమ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను 3 నుంచి 10 శాతం వరకు పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. పెంచిన ఈ కొత్త ప్లాన్ల ధరలు గురువారం నుంచి అమలులోకి రానున్నాయి. సవరించిన ప్లాన్ల ప్రకారం ఇకపై నెలకు రూ. 499 నుంచి రూ. 1,799 వరకు వేర్వేరు ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. ధరల పెంపుతో పాటు వినియోగదారులకు ఏడాదికి ఒకసారి ఉచిత అంతర్జాతీయ రోమింగ్ (International Roaming) ప్యాక్‌ను ఈ కొత్త ప్లాన్లలో చేర్చినట్లు ఎయిర్‌టెల్ కంపెనీ వెల్లడించింది.

ఈ ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్ ఆఫర్ ద్వారా ప్రతీ పిన్‌కి 5 రోజుల పరిమితితో 5జీబీ డేటా, 60 నిమిషాల టాక్‌టైమ్‌, 25 అవుట్‌గోయింగ్ ఎస్‌ఎంఎస్‌లతో పాటు ఉచిత ఇన్‌కమింగ్ ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు లభిస్తాయి. కొత్త ధరల వివరాలను పరిశీలిస్తే.. ఇప్పటివరకు రూ. 449గా ఉన్న వ్యక్తిగత (Individual) ప్లాన్ ధర రూ. 499కి పెరిగింది. రెండు సిమ్‌లకు వర్తించే రూ. 699 ప్లాన్ రూ. 749కి, మూడు సిమ్‌ల ప్లాన్ రూ. 999 నుంచి రూ. 1,049కి పెరిగింది. అలాగే నాలుగు సిమ్‌ల ప్లాన్లు రూ. 1,249 మరియు రూ. 1,449కి చేరగా, నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే ఐదు సిమ్‌ల ఫ్యామిలీ ప్లాన్ ధర రూ. 1,799గా నిర్ణయించారు.

అపరిమిత డేటా, ఉచిత కాలింగ్, వినోద సేవలతో పాటు స్పామ్, ఫ్రాడ్ రక్షణ ఫీచర్లను ఈ ప్లాన్లలో అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్ మార్కెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ అమిత్ త్రిపాఠి తెలిపారు. కొత్తగా పోస్ట్‌పెయిడ్‌కి మారే వినియోగదారులతో పాటు, ప్రస్తుతం పాత పోస్ట్‌పెయిడ్ లేదా ప్రీపెయిడ్‌లో ఉన్న వినియోగదారులు కూడా గురువారం నుంచి ఈ నూతన ప్లాన్లకు సులభంగా అప్‌గ్రేడ్ కావచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *