తెలంగాణలో రైతులకు సాగునీరు అందించడంపై దృష్టి పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. బుధవారం రామగుండం ఎన్టీపీసీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల వల్ల కరువు పరిస్థితులు నెలకొంటున్నందున, సాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఈటల విమర్శించారు. అలాగే తెలంగాణకు కీలకమైన సింగరేణి సంస్థను అమ్ముకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బొగ్గు ఉత్పత్తి, కార్మికుల సంక్షేమంపై స్పష్టమైన విధానాన్ని వెల్లడించాలని, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
