Breaking News

తుమ్మిడిహట్టి బ్యారేజీకి త్వరగా అనుమతులు ఇవ్వాలి

కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి..

ఢిల్లీ: తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి త్వరగా అనుమతులు ఇప్పించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం కోరిన సమాచారాన్ని ఇప్పటికే సమర్పించినట్లు కేంద్ర మంత్రికి వివరించారు.

మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఢిల్లీలో సీఆర్ పాటిల్‌తో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణకు సంబంధించిన పలు సాగునీటి ప్రాజెక్టులపై చర్చించారు.

తుమ్మిడిహట్టి బ్యారేజీని ఎఫ్‌ఆర్‌ఎల్‌ +152 మీటర్ల స్థాయిలో నిర్మించేందుకు తెలంగాణ, మహారాష్ట్ర మధ్య త్వరగా అంగీకారం కుదిరేలా కేంద్రం చొరవ తీసుకోవాలని సీఎం కోరారు. ఈ స్థాయిలో బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీ ద్వారా నీటిని ఎల్లంపల్లికి తరలించే అవకాశం ఉంటుందని, తద్వారా విద్యుత్ వినియోగం, వ్యయం తగ్గుతాయని వివరించారు.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం, సీతారామ సాగర్ బహుళార్థక ప్రాజెక్టు, గౌరవెల్లి రిజర్వాయర్‌కు పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. అనుమతుల జాప్యం కారణంగా ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరుగుతోందని తెలిపారు.

సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం వద్ద పెండింగ్‌లో ఉన్న అనుమతులను కూడా త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి సమర్పించినట్లు, నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట్ర అంశాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలని కోరారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం పొందేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆధ్వర్యంలో చేపడుతున్న టెలీమెట్రీ యంత్రాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం కోరారు. మొదటి దశ టెలీమెట్రీ యంత్రాల ఏర్పాటుకు అవసరమైన రూ.4.15 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జమ చేసిందని తెలిపారు. మొదటి దశతో పాటు రెండో, మూడో దశల టెలీమెట్రీ యంత్రాలను కూడా త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ సమావేశంలో మంత్రి జి. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నీటిపారుదల) ఆదిత్యనాథ్ దాస్, సీఎం సెక్రటరీ మాణిక్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *