ముధోల్, అక్టోబర్ 7 (E6tvNEWS: ప్రతినిధి).
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి వనరులు తగ్గిపోతున్నందున రైతులు పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. ముధోల్ మండలం బోరెగాం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పొలం బడి కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధన స్థానం, ముధోల్ శాస్త్రవేత్త ఆకుల దినేష్ మాట్లాడుతూ… ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి పంటకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో సాగు చేసే ఆరుతడి పంటలను ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు. సోయాబీన్ DSB-34 విత్తనాల నిల్వ, నాణ్యత పరిరక్షణతో పాటు పొద్దుతిరుగుడు, జొన్న, సజ్జలు, వివిధ పప్పుధాన్యాల సాగు విధానాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం సాగులో ఉన్న కంది పంటలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు, పంటల యాజమాన్య పద్ధతులపై రైతులకు వివరించారు. తక్కువ నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దాసరి రచన, వ్యవసాయ విస్తరణ అధికారులు ఎం. రమేష్, పి. భూమేష్, గ్రామ సర్పంచ్ కల్లెడ కిష్టయ్య, ఆత్మ డైరెక్టర్ సాయన్న, మాజీ ఎంపీటీసీ గైని భోజన్న, విట్టల్ కాంబ్లెతో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.

