మంత్రి సత్యకుమార్ ఆదేశాలతో స్థల పరిశీలన
ధర్మవరం, అక్టోబర్ 7 (E6tvNEWS: ప్రతినిధి).
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో కాపు భవన్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు తెలిపారు. బుధవారం పోతుకుంట రోడ్డులోని డీఎస్పీ గెస్ట్‌హౌస్ సమీపంలో కాపు భవన్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ధర్మవరం శ్రీకృష్ణదేవరాయల బలిజ సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు కాపు భవన్ నిర్మాణానికి సంబంధించిన సమస్యలను హరీష్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ సమస్యను మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా, సమస్యను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన హరీష్ బాబును ఆదేశించినట్లు సంఘం నాయకులు తెలిపారు.
2019లోనే స్థలం కేటాయింపు
కాపు భవన్ నిర్మాణం కోసం 2019లోనే స్థలం కేటాయించినట్లు సంఘం నాయకులు వివరించారు. సర్వే నంబర్ 396/6లో 35 సెంట్లు, 396/7లో 34 సెంట్లు కలిపి మొత్తం 69 సెంట్ల స్థలాన్ని కాపు భవన్ నిర్మాణానికి కేటాయించినట్లు తెలిపారు. భవన నిర్మాణానికి సంబంధించి అప్పట్లో రూ.2.20 లక్షల డీడీ కూడా తీసినప్పటికీ వివిధ కారణాలతో నిర్మాణ పనులు ముందుకు సాగలేదని పేర్కొన్నారు.కేటాయించిన స్థలాన్ని పరిశీలించిన హరీష్ బాబు.. భవన నిర్మాణానికి సంబంధించిన వివరాలను సంఘం నాయకులను అడిగి తెలుసుకున్నారు. సమస్యను మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రెవెన్యూ అధికారులతో చర్చించి, కాపు భవన్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
కాపు భవన్ నిర్మాణం పూర్తయితే కాపు, బలిజ సామాజిక వర్గాల ప్రజలకు వివిధ కార్యక్రమాల నిర్వహణతో పాటు సామాజిక అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుందని హరీష్ బాబు తెలిపారు.కార్యక్రమంలో ధర్మవరం కాపు సంఘం అధ్యక్షులు, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.


