ధర్మవరం, సెప్టెంబరు 28:(E6tv NEWS: ప్రతిని)
ధర్మవరం పట్టణ ప్రజలకు అందుతున్న ప్రాథమిక వైద్య సేవలు, ఆసుపత్రిలోని సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఆయన నియోజకవర్గ ఇన్చార్జి హరీష్ బాబు తెలిపారు.
మంత్రి ఆదేశాల మేరకు సోమవారం ధర్మవరం పట్టణంలోని ఎర్రగుంట సర్కిల్లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను హరీష్ బాబు సందర్శించారు. ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించడంతో పాటు, చికిత్స కోసం వచ్చిన ప్రజలను నేరుగా కలిసి వైద్య సేవలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.మందుల లభ్యత, వైద్య పరీక్షలు, ఇతర సౌకర్యాలపై ప్రజల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆసుపత్రిలోని ఫార్మసీ, డిస్పెన్సరీ, ల్యాబొరేటరీ, డ్రెస్సింగ్ మరియు అత్యవసర చికిత్స గది, ఓపీ రిజిస్ట్రేషన్ విభాగం, మైనర్ ఆపరేషన్ థియేటర్లను పరిశీలించారు. ఆయా విభాగాల్లో అందుతున్న సేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, రోగులకు కల్పిస్తున్న ఏర్పాట్లను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు వైద్యం అందించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందేలా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని హరీష్ బాబు సూచించారు. అవసరమైన సౌకర్యాలు, ఆసుపత్రిలోని సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో నిరంతరం పరిశీలిస్తూ, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచనల మేరకు చర్యలు కొనసాగిస్తామని హరీష్ బాబు పేర్కొన్నారు.


