దసరా, దీపావళి పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాలకు 750కి పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ శ్రీధర్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. రద్దీకి అనుగుణంగా అవసరమైతే మరిన్ని రైళ్ల సంఖ్యను పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. పండుగల వేళ ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందులో భాగంగా అదనపు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు భద్రత దృష్ట్యా సీసీ కెమెరాల ద్వారా నిఘాను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. అయితే, ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణించే వారు సాధారణ ఛార్జీల కంటే మూడో వంతు మేర అదనపు ఛార్జీని చెల్లించాల్సి ఉంటుందని రైల్వే శాఖ పేర్కొంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణ ప్రణాళికలను రూపొందించుకోవాలని అధికారులు సూచించారు.
ప్రయాణికులకు గుడ్‌న్యూస్: IRCTC బిగ్ అప్‌డేట్!
