రక్తదాన శిబిరానికి స్పందించిన పలువురు దాతలు
రుద్రూరు, సెప్టెంబర్ 16 (E6 న్యూస్: ప్రతినిధి).
నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పలు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల ఆధ్వర్యంలో, గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన పలువురు ప్రజలు శిబిరానికి హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు. వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చిన వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించి తగిన వైద్య సలహాలు అందించారు.వైద్య శిబిరంతో పాటు రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.
గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడంతో పాటు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. వైద్య శిబిరంలో సేవలందించిన వైద్యులకు, నిర్వాహకులకు గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ ఇందూరు చంద్రశేఖర్‌తో పాటు పలువురు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని, భవిష్యత్తులోనూ మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.
