Breaking News

మౌంట్ తరంగ్–II అధిరోహించిన విశాలావత్ బన్నీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సన్మానం

హైదరాబాద్, అక్టోబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి)

హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్–స్పితి జిల్లాలో ఉన్న మియార్ లోయలో 6,027 మీటర్ల ఎత్తైన సాంకేతిక శిఖరం మౌంట్ తరంగ్–IIను విజయవంతంగా అధిరోహించిన తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థి విశాలావత్ బన్నీని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘనంగా సన్మానించారు.

ట్రాన్స్‌సెండ్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో పది మంది సభ్యులతో కూడిన భారతీయ పర్వతారోహణ బృందం మియార్ లోయలో సవాలుతో కూడిన ఈ శిఖరారోహణను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ బృందంలో తెలంగాణకు చెందిన విశాలావత్ బన్నీ పాల్గొనడం విశేషమని అధికారులు తెలిపారు.శిఖరాన్ని అధిరోహించిన సందర్భంగా బన్నీ పర్వత శిఖరంపై భారత జాతీయ త్రివర్ణ పతాకంతో పాటు తెలంగాణ గిరిజన సంక్షేమ ఎడ్యుకేషనల్ సొసైటీ కళాశాల ఫ్లెక్సీని ప్రదర్శించారు. గతంలోనూ బన్నీ కిలిమంజారో, కాంగ్ యత్సే లా, లడక్ కైగర్ వంటి పర్వతాలను అధిరోహించి తన ప్రతిభను చాటుకున్నాడు.

గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాహస క్రీడలు, పర్వతారోహణ వంటి రంగాల్లోనూ రాణించడం అభినందనీయమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. బన్నీ విజయాన్ని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ విద్యా సొసైటీ కార్యదర్శి కె. సీతాలక్ష్మి, IAS, అదనపు కార్యదర్శి నటరాజ్, జాయింట్ సెక్రటరీ డీఎస్ వెంకన్న, డిగ్రీ డీఎస్ డాక్టర్ వేణుగోపాల్ రావు, కామారెడ్డి గిరిజన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. శ్రీనివాస స్వామి, పీడీ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *