Breaking News

నైపుణ్యంతోనే మహిళా సాధికారత

యువతులు స్వయం ఉపాధి సాధించి కుటుంబాలకు అండగా నిలవాలి: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

భైంసా, అక్టోబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి).
యువతులు ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం సాధించి స్వయం ఉపాధి పొందుతూ తమ సొంత కాళ్లపై నిలబడాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. భైంసా పట్టణంలోని శ్రీ షిరిడి సాయి సేవా సొసైటీ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న యువతులకు నిర్వహించిన సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న యువతులకు ఎమ్మెల్యే సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో యువతులకు వృత్తి నైపుణ్యం ఎంతో అవసరమని అన్నారు. ఒక నైపుణ్యాన్ని నేర్చుకుంటే ఎక్కడైనా ఉపాధి పొందడంతో పాటు స్వయం ఉపాధి ద్వారా కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవవచ్చని తెలిపారు.యువతులు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ద్వారా కుట్టు మిషన్లు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

యువతులకు ఉపాధి కల్పించే దిశగా వృత్తి నైపుణ్య శిక్షణ అందిస్తున్న శ్రీ షిరిడి సాయి సేవా సొసైటీ సేవలను ఎమ్మెల్యే అభినందించారు. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను సద్వినియోగం చేసుకుని యువతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో భైంసా మున్సిపల్ చైర్మన్ తుమ్మోల దత్తాత్రి, ఎస్‌ఆర్‌టీ, ఆర్‌ఐ చైర్మన్ కిషోర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

– రిజ్వాన్ అహ్మద్,
ప్రతినిధి, E6 టీవీ న్యూస్, ముధోల్ తాలూకా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *