హైదరాబాద్లో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి ఇటీవల ప్రవేశపెట్టిన ‘కామన్ మొబిలిటీ కార్డ్’ (నెలవారీ పాస్ ధర రూ.8,500) ధరలపై విమర్శలు రావడంతో తెలంగాణ ప్రభుత్వం పునఃసమీక్షకు సిద్ధమైంది. ఈ ధరలు సామాన్యులకు పెనుభారంగా మారాయన్న అభ్యంతరాల నేపథ్యంలో, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచన మేరకు ఛార్జీలను తగ్గించేందుకు నిర్ణయించినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం తెలిపారు. త్వరలోనే ఉన్నతాధికారులతో సమావేశమై సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా కొత్త ధరలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.
