Breaking News

అర్హులైన లబ్ధిదారుల గుర్తింపునకు మరింత గడువు కావాలి

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల జాబితాలో పొరపాట్లు సరిచేసి నిజమైన పేదలకు న్యాయం చేయాలి

రుద్రూర్, సెప్టెంబర్ 30:(E6tv NEWS: ప్రతినిధి)

రుద్రూర్ మండల కేంద్రంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించేందుకు అధికారులకు మరింత సమయం ఇవ్వాలని మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాము కోరారు. సుమారు 15 రోజులు నుంచి నెల రోజుల వరకు అదనపు సమయం కేటాయించి, అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇళ్లను కేటాయిస్తే అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు.

గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రుద్రూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పత్తి రాము, సర్పంచ్ మాట్లాడారు. రుద్రూర్ గ్రామంలో 150 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించారని, లబ్ధిదారుల జాబితాలో కొన్ని అవకతవకలు ఉన్న విషయాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం 488 దరఖాస్తులు వచ్చాయని, గ్రామసభ నిర్వహించి కుల సంఘాల ఆధ్వర్యంలో పేర్లను పరిశీలించి లబ్ధిదారుల జాబితాను తయారు చేసి తహసీల్దార్‌కు అందించినట్లు తెలిపారు. అయితే తుది జాబితాలో కొందరు అనర్హుల పేర్లు రావడంతో పాటు అద్దె ఇళ్లలో నివసిస్తున్న అర్హులైన పేదల పేర్లు L3 కేటగిరీలోకి వెళ్లడంతో వారు అయోమయానికి గురవుతున్నారని పేర్కొన్నారు.

ప్రజాపాలన దరఖాస్తుల్లో సుమారు 832 దరఖాస్తులు వచ్చాయని, అధికారులు నిర్వహించిన విచారణలో అద్దె ఇంట్లో నివసిస్తున్న కొందరు నిరుపేదల విషయంలో ఇంటి యజమాని భవనం వివరాలు వారి సొంత ఆస్తిగా నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయని వారు తెలిపారు. దీంతో నిజమైన పేదలు నష్టపోతున్నారని, ఇలాంటి పొరపాట్లను సరిచేయడానికి మరింత సమయం అవసరమని అన్నారు.ప్రస్తుతం గెజిటెడ్ అధికారుల ద్వారా మరోసారి విచారణ జరుగుతోందని, ఎవరికి అన్యాయం జరగకుండా అర్హులైన నిరుపేదలను గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. L1, L2, L3 కేటగిరీల విషయంలో కూడా స్పష్టత లేకపోవడంతో పలువురు లబ్ధిదారులు సందిగ్ధంలో ఉన్నారని చెప్పారు. కేటగిరీల ఆధారంగా అర్హులను పక్కన పెట్టకుండా, ప్రతి కుటుంబం వాస్తవ పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి తుది జాబితా రూపొందించాలని కోరారు.

ఈ విషయాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, అవసరమైతే మంత్రులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. అధికారులు సమగ్ర విచారణ పూర్తి చేసి నిజమైన నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలని కోరారు.ఈ సమావేశంలో ఉప సర్పంచ్ నిస్సార్, నాయకులు మొద్దుల నర్సయ్య, సయ్యద్, వార్డు సభ్యుడు రవి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *