సంక్షేమ పథకాల సమాచారం ఇవ్వడం లేదని బీజేపీ నేతల ఆరోపణలు
రుద్రూర్, సెప్టెంబర్ 30:(E6tv NEWS: ప్రతినిధి)
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం (ఆర్) గ్రామంలో బీజేపీకి చెందిన సర్పంచ్, ఉప సర్పంచ్‌లపై అధికార యంత్రాంగం, అధికార పార్టీ నాయకులు వివక్ష చూపుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. రుద్రూర్‌లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు ఈ ఆరోపణలు చేశారు.
అంబం (ఆర్) గ్రామానికి 25 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ, ఈ విషయంపై సర్పంచ్, గ్రామ కార్యదర్శికి సరైన సమాచారం ఇవ్వలేదని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. సర్పంచ్ బీజేపీకి చెందిన వ్యక్తి కావడం వల్లే సంక్షేమ పథకాల విషయంలో ఆయనకు సమాచారం ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఇలా వ్యవహరిస్తే అర్హులైన లబ్ధిదారులకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. రుద్రూర్ మండల కేంద్రంలో నిర్మించిన 150 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలోనూ అవకతవకలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. అధికారులు ప్రకటించిన L1, L2, L3 జాబితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇల్లు, భూమి ఉన్న కొందరిని అర్హుల జాబితాలో చేర్చారని, నిజమైన నిరుపేదలను పక్కన పెట్టారని ఆరోపించారు.
అధికార పార్టీలోని రెండు వర్గాలు తమకు అనుకూలంగా ఉన్నవారికి లబ్ధి చేకూర్చేలా జాబితాల్లో మార్పులు చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. లబ్ధిదారుల ఎంపికపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ప్రకారం నిజమైన అర్హులను గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.సంక్షేమ పథకాల అమలులో రాజకీయ వివక్షకు తావులేకుండా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని బీజేపీ నాయకులు హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు మార్కెలి ప్రకాష్ పటేల్, జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు, గూడూరు ప్రశాంత్ గౌడ్, జిల్లా నాయకులు కటిక రామరాజు, ఎస్సీ మోర్చా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ బేగరి వినోద్ కుమార్, మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, ఉపాధ్యక్షులు ఎం.వి. కృష్ణంరాజు, భోజిగొండ అనిల్, రేపల్లి సాయిప్రసాద్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు సతీష్ పవర్, బేగరి సాయికుమార్, కేవీడీ సాయిలు, రజినీకాంత్, నడిపి రాజేష్, కుశాల్, బైండ్ల గంగాధర్, గణేష్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

