అధికారుల నిర్లక్ష్యంపై మహిళల ఆవేదన.. రెండు రోజుల్లో శుభ్రం చేయకపోతే ధర్నా చేస్తాం: మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య
రామచంద్రపురం, అక్టోబర్ 14 (E6 న్యూస్ ప్రతినిధి)
రామచంద్రపురంలోని రాయసముద్రం చెరువు వద్ద ఉన్న బతుకమ్మ ఘాట్ బురద, చెత్తాచెదారంతో అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘాట్‌ను పట్టించుకునే వారే కరువయ్యారని మహిళలు వాపోతున్నారు. ఇటీవల పోచమ్మ గుడిలో నిర్వహించిన దుర్గామాత అన్నదాన కార్యక్రమం సందర్భంగా మహిళలు ఈ సమస్యను మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో స్పందించిన తొంట అంజయ్య బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు అప్పల భాస్కర్, కుమ్మరి మానయ్య, సాయి గౌడ్, స్వామి, మనీష్ రెడ్డి తదితరులతో కలిసి బతుకమ్మ ఘాట్‌ను పరిశీలించారు. అక్కడ పేరుకుపోయిన బురద, చెత్తను తొలగించి, ఘాట్‌ను శుభ్రం చేయాలని సంబంధిత అధికారులను కోరారు.
ఈ సమస్యపై అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా డిప్యూటీ కమిషనర్ అందుబాటులోకి రాలేదని, ఏఈని సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని నాయకులు తెలిపారు. అయితే డీఈ వెంకటరమణ ఫోన్‌లో స్పందిస్తూ, చెరువులో డీసిల్టింగ్ పనులు చేపట్టి శుభ్రమైన నీటిని నింపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.రెండు రోజుల్లో బతుకమ్మ ఘాట్‌ను శుభ్రం చేసి, చెరువులో నీటిని నింపాలని తొంట అంజయ్య అధికారులను కోరారు. నిర్ణీత గడువులోగా పనులు చేపట్టకపోతే బీఆర్‌ఎస్ కార్యకర్తలతో కలిసి డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడే బతుకమ్మ ఘాట్‌ను వెంటనే శుభ్రం చేసి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
