నిజామాబాద్, అక్టోబర్ 1:(E6tv NEWS: ప్రతినిధి)
గుడుంబా విక్రయిస్తూ పట్టుబడిన మహిళకు విధించిన ఏడాది జైలు శిక్షను నిజామాబాద్ అదనపు జిల్లా న్యాయస్థానం (ADJ) కూడా సమర్థించింది. దిగువ కోర్టు తీర్పుపై నిందితురాలు చేసిన అప్పీల్‌ను విచారించిన న్యాయస్థానం, గతంలో విధించిన శిక్షనే కొనసాగిస్తూ తీర్పు వెలువరించింది.
ఆర్మూర్ పట్టణంలో గుడుంబా విక్రయిస్తున్న మహిళను ఎక్సైజ్ పోలీసులు 2024 జనవరి 5న పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున సాక్షులను ప్రవేశపెట్టి నేరం రుజువు చేయడంతో ఆర్మూర్ ప్రథమ శ్రేణి న్యాయస్థానం నిందితురాలికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది.ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితురాలు నిజామాబాద్ ADJ కోర్టును ఆశ్రయించగా.. విచారణ అనంతరం దిగువ కోర్టు విధించిన శిక్షను సమర్థిస్తూ తాజాగా తీర్పు వెలువడింది. దీంతో గుడుంబా విక్రయ కేసులో నిందితురాలికి ఏడాది జైలు శిక్ష కొనసాగనుంది.
