Breaking News

వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపిన ‘పోచారం భాస్కరన్న భరోసా’

ముగ్గురికి కృత్రిమ చేయి, కాళ్ల అందజేత..

మండలాల వారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తాం: పోచారం శ్రీనివాసరెడ్డి

బాన్సువాడ, అక్టోబర్ 1: (E6tv NEWS: ప్రతినిధి)

అంగవైకల్యం జీవితానికి అడ్డంకి కాకూడదనే మానవతా దృక్పథంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వికలాంగులకు అండగా నిలుస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మాజీ డీసీసీబీ చైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బాన్సువాడ నియోజకవర్గ వికలాంగుల జీవితాల్లో పోచారం భాస్కరన్న భరోసా’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. కృత్రిమ అవయవాల అమరిక నిపుణుడు డాక్టర్ అతుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కారణాలతో అంగవైకల్యానికి గురైన కరణ్ సింగ్‌కు కృత్రిమ చేయి, మహమ్మద్, యాదగిరిలకు కృత్రిమ కాళ్లను అందజేశారు. లండన్ (యూకే)కు చెందిన ఎండోలైట్ కంపెనీకి చెందిన ఈ ఆధునిక సహాయక పరికరాల విలువ ఒక్కొక్కటి సుమారు రూ.2 లక్షలు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. అంగవైకల్యం వారి జీవితానికి అడ్డంకిగా మారకూడదన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అవసరమైన సహాయక పరికరాలను పొందలేని కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో తన చిన్న కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు.నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి, అవసరమైన వికలాంగులను గుర్తించి వారికి అవసరమైన సహాయక పరికరాలను అందించే కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. క్యాంపుల తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఆధునిక కృత్రిమ కాళ్లు, చేతులు అందుబాటులోకి రావడం ద్వారా వికలాంగులు తిరిగి తమ పనులను తాము చేసుకునే అవకాశం కలుగుతుందని, వారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం పెరుగుతుందని పేర్కొన్నారు.

కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఆ సమయంలో బాధితుల కోసం సుమారు రూ.3 కోట్ల వరకు ఖర్చు చేసి ప్రజలకు సహాయం అందించామని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని అన్నారు. ఈ సేవా కార్యక్రమాలు ఓట్ల కోసం, రాజకీయాల కోసం కాకుండా మానవతా బాధ్యతగా చేపడుతున్నామని పేర్కొన్నారు.

మానవత్వానికి ప్రతీక: శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ‘పోచారం భాస్కరన్న భరోసా’ కార్యక్రమం మానవత్వానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఆర్థిక ఇబ్బందులతో కృత్రిమ అవయవాలు పొందలేక ఇబ్బంది పడుతున్న వారికి సహాయక పరికరాలు అందించడం ద్వారా వారి జీవితాల్లో కొత్త ఆశలు నింపుతున్నారని తెలిపారు.డబ్బు ఉండటమే సేవ చేయడానికి ప్రాతిపదిక కాదని, ఇతరుల కష్టాన్ని చూసి స్పందించే మనసు, మానవత్వం, సహృదయం ఉండటం ముఖ్యమన్నారు. పదవులతో సంబంధం లేకుండా ప్రజల కష్టాలను గుర్తించి అవసరమైన సమయంలో అండగా నిలవడమే నిజమైన ప్రజాసేవకు నిదర్శనమని పేర్కొన్నారు.

బాన్సువాడ ప్రాంత అభివృద్ధిలో పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన కృషిని ఆయన ప్రస్తావించారు. విద్యా రంగంలో ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ద్వారా వేలాది మంది విద్యార్థులకు విద్యావకాశాలు లభించాయని తెలిపారు.ఒక కృత్రిమ చేయి లేదా కాలు కేవలం సహాయక పరికరం మాత్రమే కాదని.. అది ఒక వ్యక్తితో పాటు అతని కుటుంబంలో కొత్త ఆశ, ఆత్మవిశ్వాసాన్ని నింపే సాధనమని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

‘మాట ఇచ్చాను.. మాట నిలబెట్టుకున్నాను’

పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో ముగ్గురు వికలాంగులకు కృత్రిమ చేయి, కాళ్లు అందిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానన్నారు.

తన తండ్రి పోచారం శ్రీనివాసరెడ్డి చిన్నప్పటి నుంచే ‘ఎవరికైనా మాట ఇస్తే.. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ మాటను నిలబెట్టుకోవాలి’ అని చెప్పేవారని, ఆ మాటను తన జీవితంలో ఒక సూత్రంగా తీసుకున్నానని తెలిపారు.

ఈ కార్యక్రమం ఈ ముగ్గురితోనే ఆగిపోదని.. నియోజకవర్గంలో అవసరం ఉన్న ప్రతి వికలాంగుడికి సాధ్యమైనంత వరకు సహాయం అందించేందుకు సంకల్పించానన్నారు. గ్రామాల్లో ఉన్న వికలాంగులను గుర్తించి, మండలాల వారీగా నిర్వహించే క్యాంపులకు తీసుకురావాలని నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను కోరారు.

కాళ్లు, చేతులు కోల్పోయిన వారితో పాటు కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారిని కూడా తన దృష్టికి తీసుకురావాలని, వారి సమస్యలను తెలుసుకుని సాధ్యమైనంత వరకు సహాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు.

‘ఒక్కరి జీవితంలో వెలుగు నింపడం కాదు.. అవసరం ఉన్న ప్రతి కుటుంబంలో ఆశను నింపే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడమే నా సంకల్పం’ అని పోచారం భాస్కర్ రెడ్డి తెలిపారు.కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వికలాంగుల కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *