భారత్లోని ఇతర ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం తన స్వంత పన్ను రాబడి కోసం మద్యం రంగానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ రాబడి నివేదిక వెల్లడించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థానిక పన్ను ఆదాయంలో ఏకంగా 31.8 శాతం వాటా కేవలం మద్యం పన్నుల నుంచే వచ్చింది. ఇది నివేదికలో పోల్చిన అన్ని రాష్ట్రాల కంటే అత్యధికం కావడం గమనార్హం. కాగా తమిళనాడు (26.9%), ఉత్తరప్రదేశ్ (24.7%), ఆంధ్రప్రదేశ్ (23.8%), కేరళ (22.4%), కర్ణాటక (20.4%), రాజస్థాన్ (18.8%), హర్యానా (17.2%), జార్ఖండ్ (12.8%), మరియు మహారాష్ట్ర (11.7%) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
మద్యం రాబడిపై తీవ్రంగా ఆధారపడుతున్నప్పటికీ, ఈ రంగంలో పన్ను వృద్ధి రేటు అత్యంత నెమ్మదిగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 2021–22 నుండి 2025–26 ఆర్థిక సంవత్సరాల మధ్య తెలంగాణ కేవలం 5.9 శాతం వృద్ధి రేటును మాత్రమే నమోదు చేసి, ఆంధ్రప్రదేశ్ (5.1%), కేరళ (7.4%) లతో పాటు చివరి వరుసలో నిలిచింది. ఇదే సమయంలో మహారాష్ట్ర (24.7%), ఛత్తీస్గఢ్ (21.5%), ఒడిశా (20%), రాజస్థాన్ (16.1%) వంటి రాష్ట్రాలు వేగవంతమైన వృద్ధిని సాధించాయి. తెలంగాణలో మద్యం విక్రయాల పరిమాణం కేవలం 1.6 శాతం మాత్రమే పెరిగిందని, అయితే ధరల సవరణ మరియు ఉత్పత్తుల మార్పుల వల్లే రాబడి కొంత మేర పెరిగిందని, షాపుల సంఖ్య, బ్రాండ్లు, పన్నుల నిర్మాణం వంటి అంశాలు రాబడిపై ప్రభావం చూపుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది.
