Breaking News

ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు పటిష్ట పోలీస్ బందోబస్తు

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్

చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 20 (E6tv న్యూస్).

శ్రీ సత్యసాయి జిల్లాలో అక్టోబర్ 21 నుంచి ప్రారంభం కానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు నామినేషన్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

ధర్మవరం రూరల్, బత్తలపల్లి, తాడిమర్రి, పట్నం, రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి తదితర మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల నేపథ్యంలో సంబంధిత ఎంపీడీవో కార్యాలయాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నామినేషన్ల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగిన సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించడంతో పాటు, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.రెండు రోజుల క్రితం ధర్మవరం మున్సిపల్ నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీల నాయకులపై ఆరు కేసులు నమోదు చేసి, మొత్తం 59 మందిని నిందితులుగా చేర్చినట్లు అడిషనల్ ఎస్పీ వెల్లడించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ సందర్భంగా అమల్లో ఉన్న 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లను ఇప్పటికే బైండోవర్ చేసినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైన సందర్భాల్లో బెయిల్ రద్దు కోసం చర్యలు చేపడతామని హెచ్చరించారు.రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడటం, గుంపులుగా చేరి అల్లర్లు సృష్టించడం, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి

ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లతో పాటు తదుపరి ఎన్నికల ప్రక్రియ కూడా ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, వారి అనుచరులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిబంధనలను పాటిస్తూ శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని సూచించారు.ఈ మీడియా సమావేశంలో ధర్మవరం డీఎస్పీ రత్నాకర్ రాజు, రామగిరి సీఐలు మహమ్మద్ అలీ, ఇస్మాయిల్, ఎస్‌ఐ లక్ష్మీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *