కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి)
భీంగల్‌లో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పొలాస సుధాకర్ పోలీసుల వేధింపులు తాళలేక పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని, చికిత్స పొందుతూ మృతి చెందడం అత్యంత విషాదకరమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సుధాకర్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన ఆరోపించారు.సుధాకర్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బాల్కొండ నియోజకవర్గానికి వెళ్తున్న తనను హైదరాబాద్‌లోని నివాసంలోనే పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం ప్రభుత్వ పిరికిపంద చర్య అని, ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు.
పోలీసుల ప్రమేయం లేదనడం బాధ్యతారాహిత్యం
తనను పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని సుధాకర్ కాలిన గాయాలతో స్వయంగా వెల్లడించారని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. చావుబతుకుల మధ్య ఉన్న వ్యక్తి చేసిన ఆరోపణలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా పోలీసుల ప్రమేయం లేదని జిల్లా పోలీసు అధికారి చెప్పడం బాధ్యతారాహిత్యమన్నారు. భీంగల్ ఎస్‌ఐ తిరుపతిని ఉన్నతాధికారులు వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు.తాను ఎలాంటి పార్టీ కార్యక్రమానికి వెళ్లడం లేదని, తన నియోజకవర్గానికి చెందిన చిరు వ్యాపారి మృతి చెందడంతో కుటుంబాన్ని పరామర్శించేందుకు, చివరి చూపు చూసేందుకు వెళ్తున్నానని చెప్పారు. హైదరాబాద్‌లోనే తనను హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
ప్రభుత్వానికి పలు డిమాండ్లు
సుధాకర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేశారు.
సుధాకర్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని,భీంగల్ ఎస్‌ఐ తిరుపతిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి విధుల నుంచి తొలగించాలని,బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.కుటుంబానికి తక్షణ ఆర్థిక, న్యాయ సహాయం అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.సుధాకర్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తామని ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే ఎస్‌ఐపై మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
