కామారెడ్డి, అక్టోబర్ 25: (E6tv న్యూస్).
కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట గత 13 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఉద్యోగులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.ఆదివారం సమ్మె శిబిరాన్ని సందర్శించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎండీ తాహెర్, జిల్లా కార్యనిర్వహణ అధ్యక్షుడు సబ్బిడి రమేష్ సమ్మెలో పాల్గొని ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న NHM ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకపోవడం విచారకరమన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవలందించిన ఉద్యోగులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని పేర్కొన్నారు. ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించి, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వారికి అండగా ఉంటుందని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో NHM ఉద్యోగ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సుమన్, కార్యదర్శి పద్మజతో పాటు జిల్లా వ్యాప్తంగా పలువురు NHM ఉద్యోగులు పాల్గొన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు, కామారెడ్డి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు సైతం సమ్మెకు మద్దతు తెలిపారు.



