Breaking News

ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలి

డీఎంహెచ్‌ఓకు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ వినతిపత్రం

శ్రీ సత్యసాయి జిల్లా, సెప్టెంబర్ 18: (E6tv NEWS: ప్రతినిధి).

జిల్లాలో ఆశా వర్కర్స్ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ ఫైరోజ్ బేగంకు వినతిపత్రం అందజేశారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆశా వర్కర్స్‌తో రికార్డులు రాయిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఆశా వర్కర్స్‌పై అనవసరమైన పనిభారం, ఒత్తిడి లేకుండా చూడాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. 2025 డిసెంబర్‌లో విధుల్లో చేరిన ఆశా వర్కర్స్‌కు పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు.అర్హులైన ఆశా వర్కర్స్‌కు వితంతు పెన్షన్, తల్లికి వందనం తదితర సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని, అనారోగ్యంతో మృతి చెందిన ఆశా వర్కర్స్ కుటుంబాలకు చెల్లించాల్సిన గ్రాట్యుటీని వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మృతి చెందిన ఆశా వర్కర్స్ కుటుంబాల్లో అర్హులైన వారికి ఆశా వర్కర్స్‌గా అవకాశం కల్పించాలని కోరారు.

అక్టోబర్‌లో సంయుక్త సమావేశం

వినతిపత్రాన్ని స్వీకరించిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజ్ బేగం స్పందిస్తూ, ఇకపై ఆశా వర్కర్స్‌తో రికార్డులు రాయించవద్దని అధికారులకు ఆదేశాలు ఇస్తామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రికార్డులు రాయిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అక్టోబర్ 10 నుంచి 20వ తేదీలోపు జిల్లా ఆశా నోడల్ ఆఫీసర్, జిల్లా అధికారులు, ఆశా యూనియన్ నాయకులతో సంయుక్త సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలోని అన్ని మెడికల్ ఆఫీసర్లతో శుక్రవారం జూమ్ సమావేశం నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. 2025 డిసెంబర్‌లో విధుల్లో చేరిన ఆశా వర్కర్స్‌కు పెండింగ్‌లో ఉన్న వేతనాలను వచ్చే నెల 5వ తేదీలోపు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ జిల్లా నోడల్ ఆఫీసర్ త్రిలోక్‌నాథ్, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బీకే రాధమ్మ, ప్రధాన కార్యదర్శి ఎన్. సౌభాగ్యమ్మ, కోశాధికారి పి. రమాదేవి, గౌరవ అధ్యక్షులు బి. సాంబశివ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అంకె ముత్యాలు, జిల్లా నాయకులు రామ్మోహన్, సిద్ధు, యూనియన్ నాయకురాళ్లు ముంతాజ్, అంజినమ్మ, మహాలక్ష్మి, చంద్రకళ, సుశీల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *