డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా.. అవాంఛనీయ ఘటనలకు అడ్డుకట్ట
పుట్టపర్తి, అక్టోబర్ 16 (E6tv NEWS).
శ్రీ సత్యసాయి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలోని హిందూపురం, పెనుకొండ, మడకశిర, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల వద్ద విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
నామినేషన్ కేంద్రాలతో పాటు పరిసర ప్రాంతాలపై డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
ఎన్నికల సమయంలో ప్రజలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సంయమనం పాటించాలని, శాంతియుత వాతావరణం నెలకొనేలా పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.
