Breaking News

డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీలో పారదర్శకత పాటించాలి

తహసీల్దార్ తారాబాయి వైఖరి మార్చుకోవాలి: బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్

రుద్రూర్, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి)
డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, అర్హులైన నిరుపేదలకు న్యాయం చేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. రుద్రూర్ తహసీల్దార్ తారాబాయి వైఖరి సరిగా లేదని, కొంతమందికి వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తన వైఖరిని మార్చుకోకపోతే తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.

రుద్రూర్ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం మొత్తం 599 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇటీవల నిర్వహించిన గ్రామసభ అనంతరం దరఖాస్తులను కులాల వారీగా వర్గీకరించి కుల సంఘాల ప్రతినిధులకు అందించినట్లు తెలిపారు. అయితే తహసీల్దార్ కార్యాలయం నుంచి 289 మంది లబ్ధిదారులతో కూడిన జాబితాను గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ప్రదర్శించారని, అందులో అర్హులు కాని వారి పేర్లు కూడా ఉన్నాయని ఆరోపించారు.

అదేవిధంగా మరో 150 మంది లబ్ధిదారులతో ప్రత్యేక జాబితా సిద్ధం చేశారని, అర్హుల ఎంపిక విషయంలో స్పష్టత లేకుండా ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని చంద్రశేఖర్ ఆరోపించారు. అర్హులైన నిరుపేదల జాబితాను గ్రామస్తులు, కుల సంఘాలు కలిసి అందించినప్పటికీ, ఎంపిక ప్రక్రియలో కొన్ని పేర్ల విషయంలో పక్షపాతం చూపుతున్నారని ఆయన అన్నారు.గతంలో మైనింగ్‌కు సంబంధించిన వ్యవహారాల్లో తహసీల్దార్ తారాబాయి పాత్రపై ఆరోపణలు వచ్చాయని, ఆ వ్యవహారంలో నోటీసులు కూడా వచ్చినట్లు తమకు సమాచారం ఉందని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు.

బాన్సువాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి చొరవతో పెద్ద సంఖ్యలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించారని, నిజమైన నిరుపేదలకు వాటిని అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. లబ్ధిదారుల ఎంపికలో చోటుచేసుకునే తప్పిదాలు ప్రజల్లో ప్రభుత్వంపై అపోహలకు దారితీయవచ్చని పేర్కొన్నారు.డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ ప్రక్రియను నిబంధనల ప్రకారం, పూర్తి పారదర్శకతతో నిర్వహించి అర్హులైన వారికి మాత్రమే ఇళ్లు కేటాయించాలని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో ఉపసర్పంచ్ నిస్సార్, వార్డు సభ్యులు అమంద్ వెంకటేష్, పార్టీ నాయకులు కర్క అశోక్, కాసుల మహేష్, వడ్ల నరేష్, ప్రవీణ్, గాండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *