పెరటాసి మాసానికి తోడు వరుస సెలవులు రావడంతో తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగింది. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించే లక్ష్యంతో అక్టోబర్ 1, అక్టోబర్ 5 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. అయితే ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రముఖులకు మాత్రమే ఈ రద్దు నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా, అక్టోబర్ 1, 5 తేదీల బ్రేక్ దర్శనాలకు సంబంధించి సెప్టెంబర్ 30, అక్టోబర్ 4 తేదీల్లో ఎటువంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ వెల్లడించింది.
ప్రస్తుతం తిరుమలలో రోజుకు దాదాపు 80 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటుండగా, మరో 30 వేల మంది మరుసటి రోజు దర్శనం కోసం వేచి చూస్తున్నారు. భక్తుల క్యూ లైన్లు భారీగా పెరగడంతో వారి వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో క్యూ లైన్లలో వసతి, తాగునీరు, ఇతర సౌకర్యాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నామని చెబుతూ, భక్తులు కూడా టీటీడీకి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

