ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం టీడీపీలో అభ్యర్థుల ఎంపిక వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల నేపథ్యంలో పార్టీ కోసం దీర్ఘకాలంగా కష్టపడిన సీనియర్ నేతలకు తగిన ప్రాధాన్యత లభించడం లేదనే అసంతృప్తి శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గుడుపల్లి, శాంతిపురం మండలాలకు చెందిన కీలక నాయకులు, మహిళా నేతలు అభ్యర్థుల కేటాయింపులపై తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం.
కష్టకాలంలో పార్టీ కోసం కేసులు ఎదుర్కొని నిలబడిన పాత నాయకులను పక్కనపెట్టి, ఇటీవల కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుప్పం జడ్పీటీసీ సీటు కేటాయింపుతో పాటు కొన్ని కులాలకు, వర్గాలకే పదవులు దక్కుతున్నాయనే ప్రచారం ఈ విభేదాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ పరిణామాలతో కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కుప్పంలో బయటపడిన ఈ అంతర్గత విభేదాలు పార్టీ నాయకత్వానికి సవాలుగా మారాయి.
