సిరిసిల్లా ‘గడి’పై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

బిఆర్‌ఎస్ అగ్రనేత కె.టి.రామారావు సొంత నియోజకవర్గం రాజన్న సిరిసిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ కుటుంబ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ ‘గడి’ కూలినట్లే, వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లా ‘గడి’ని బద్దలు కొట్టి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. గత పదేళ్ల కాలంలో కెసిఆర్ కుటుంబం రూ. లక్ష కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టి రాష్ట్రంలోనే అత్యంత ధనవంతులుగా మారారని సీఎం ఆరోపించారు. కేటీఆర్ హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో మూడు ఫైవ్‌స్టార్ హోటళ్లతో పాటు సింగపూర్, అమెరికాల్లో భారీ పెట్టుబడులు పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా సిరిసిల్లా చేనేత కార్మికుల బతుకులు మారలేదని, గత పాలనలో వారి ఆత్మహత్యలు తగ్గలేదని మండిపడ్డారు.

ఈ పర్యటనలో భాగంగా సిరిసిల్లా, వేములవాడ ప్రాంతాల్లో రూ.340 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నేతన్న బజార్, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవనాలు, వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులు, నూతన ఆర్డీవో, తహశీల్దార్ ఆఫీస్ భవనాలు, ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే తమ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *