దసరా పండుగకు నిజామాబాద్ రీజియన్‌లో 719 అదనపు బస్సులు

అక్టోబర్ 9 నుంచి 26 వరకు ప్రత్యేక ఏర్పాట్లు

ప్రయాణికుల సౌకర్యార్థం ఆరు డిపోల నుంచి అదనపు సర్వీసులు

నిజామాబాద్, అక్టోబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి)

దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) నిజామాబాద్ రీజియన్ పరిధిలో 719 అదనపు బస్సులను ఏర్పాటు చేసినట్లు రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి తెలిపారు. అక్టోబర్ 9 నుంచి 26వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు వెల్లడించారు.

నిజామాబాద్-1, నిజామాబాద్-2, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, కామారెడ్డి డిపోల నుంచి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. పండుగకు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులు సురక్షితంగా, సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు.

హైదరాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్‌) వద్ద ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక అధికారులు, సిబ్బందిని విధుల్లో నియమించినట్లు తెలిపారు. బస్సుల రాకపోకలను పర్యవేక్షించడంతో పాటు ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించడం, బస్సులు సకాలంలో అందుబాటులో ఉండేలా చూడటంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.ప్రయాణికులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ముందస్తుగా టికెట్లు రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు. టీజీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ tgsrtcbus.in లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు.

దసరా పండుగను పురస్కరించుకొని ప్రజలకు, ప్రయాణికులకు, టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు రీజినల్ మేనేజర్ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *