Breaking News

ధర్మవరం మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు

ఎన్నికల భద్రత కోసం 1,500 మంది పోలీసులతో ఏర్పాట్లు.. 61 స్ట్రైకింగ్ ఫోర్సులతో నిరంతర నిఘా

ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి – జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్

ధర్మవరం, అక్టోబర్ 30 (E6 TV న్యూస్).

ధర్మవరం మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించడమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ తెలిపారు. నవంబర్ 1వ తేదీన జరగనున్న పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు.

ఎన్నికల భద్రతా విధుల కోసం సుమారు 1,500 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు ఎస్పీ వివరించారు. పోలింగ్ కేంద్రాలను సాధారణ, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి, ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సివిల్ పోలీసులతో పాటు ఏఆర్, స్పెషల్ పార్టీలు, ఏపీఎస్పీ బలగాలను కూడా మోహరించినట్లు పేర్కొన్నారు.శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు, రూట్ మొబైల్స్, 61 స్ట్రైకింగ్ ఫోర్సులతో నిరంతర గస్తీ, పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్సులను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..

ఎన్నికల నేపథ్యంలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 163 కింద అమల్లో ఉన్న ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు.సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి ఘర్షణలు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అదనపు బలగాలను మోహరించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బయటి వ్యక్తుల అక్రమ ప్రవేశాన్ని అరికట్టడంతో పాటు నగదు, మద్యం అక్రమ రవాణాను నియంత్రించేందుకు సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. పోలింగ్ కేంద్రాలు, పరిసర ప్రాంతాలను సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నట్లు స్పష్టం చేశారు.

ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి..

ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం, ఘర్షణలు సృష్టించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఎస్పీ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రజలు, ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల అక్రమాలు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఘటనలు ఏవైనా దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు జిల్లా పోలీసులకు ప్రజలు సహకరించాలని ఎస్పీ సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *