పారదర్శకంగా భూముల హద్దుల గుర్తింపు.. రైతుల సమక్షంలోనే సర్వే చేపట్టాలి
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ జిల్లా, అక్టోబర్ 30 (E6 TV న్యూస్).
భూముల రీ సర్వే ప్రక్రియను రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం నర్సాపూర్ (జి) మండలం చాక్పల్లి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇప్పటివరకు చేపట్టిన సర్వే వివరాలు, ఇంకా సర్వే చేయాల్సిన భూముల విస్తీర్ణం, పట్టా భూములు, ఎస్సారెస్పీ భూములు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.భూముల హద్దుల గుర్తింపు విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కాగా సర్వే నిర్వహించాలని సూచించారు. రీ సర్వే ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరగాలని, సర్వే బృందంలోని సభ్యుల సమన్వయంతో పాటు సంబంధిత రైతుల సమక్షంలోనే సర్వే చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రతిరోజూ లక్ష్యాలను నిర్దేశించుకుని నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
సర్వే సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ..
ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రీ సర్వే విధుల్లో పాల్గొనే సిబ్బంది తప్పనిసరిగా టోపీలు ధరించాలని కలెక్టర్ సూచించారు. తాగునీటిని అందుబాటులో ఉంచుకోవడంతో పాటు ఓఆర్ఎస్ ద్రావణాన్ని వినియోగించాలని తెలిపారు. అధికారులు, సర్వే సిబ్బంది, రైతుల మధ్య పరస్పర సమన్వయంతో రీ సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలని పేర్కొన్నారు.
తక్కువ నీటితో పండే పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి..
అనంతరం స్థానిక రైతుతో మాట్లాడిన కలెక్టర్ ఆయన సాగు చేస్తున్న పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, భవిష్యత్తులో ఎదురయ్యే నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని సూచించారు.రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో పంట కుంటలు (ఫామ్ పాండ్స్) నిర్మించుకోవాలని, వీటి ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకుని భవిష్యత్తులో నీటి అవసరాలకు వినియోగించుకోవచ్చని తెలిపారు. రైతులు పంట కుంటలు నిర్మించుకునేలా సంబంధిత అధికారులు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని ఆదేశించారు.
ఈ తనిఖీలో తహసీల్దార్ శ్రీకాంత్, సర్వేయర్ విలాస్, గ్రామ సర్పంచ్ సుధాకర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

