రోగులకు మెరుగైన వైద్యం అందించాలి.. వైద్య సిబ్బందికి సూచనలు
వర్ని, నవంబర్ 3 (E6tv న్యూస్).
వర్ని మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను స్వయంగా కలిసి వారికి అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు.
రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల నాణ్యత, వైద్యుల అందుబాటు, చికిత్సకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందుతోందా లేదా అనే విషయంపై వైద్యులను ప్రశ్నించారు.అనంతరం డీసీహెచ్ఓ శ్రీనివాస్ ప్రసాద్‌తో మాట్లాడి ఆసుపత్రిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది వివరాలు, అదనపు సిబ్బంది అవసరం, వైద్య పరికరాల కొరత, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో వైద్య సదుపాయాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చూడాలని ఆదేశించారు.



