Breaking News

ఖాదీ కార్యాలయంలో వ్యాపారి ఆత్మహత్యాయత్నం

షాపు వివాదంతో మనస్తాపం చెంది ఒంటిపై పెట్రోల్ పోసుకున్న యజమాని

మెట్‌పల్లి, నవంబర్ 03 (E6tv న్యూస్)

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని ఖాదీ కార్యాలయంలో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. షాపు ఖాళీ చేయించే విషయంలో నెలకొన్న వివాదంతో మనస్తాపానికి గురైన 26వ నంబర్ షాపు యజమాని గోవర్ధన్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళితే.. తన షాపును ఖాళీ చేయాలని గత కొంతకాలంగా కిరాయిదారుడిని కోరుతున్నప్పటికీ స్పందించడం లేదని గోవర్ధన్ ఆరోపిస్తున్నారు. తాను స్వయంగా షాపు నిర్వహించుకుంటానని చెప్పినా కిరాయిదారుడికి అధికారులు, రాజకీయ నాయకులు మద్దతుగా నిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమస్యపై న్యాయం చేయాలని కోరుతూ పది రోజుల క్రితం జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి కుటుంబసభ్యులతో కలిసి హాజరై కలెక్టర్‌కు తమ గోడును విన్నవించుకున్నారు. తమ సమస్య పరిష్కారం కాకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని వేడుకున్నట్లు సమాచారం. సమస్య పరిష్కారం కాలేదని ఆరోపిస్తూ, మంగళవారం ఖాదీ కార్యాలయంలో దుకాణదారులతో నిర్వహించిన సమావేశానికి హాజరైన గోవర్ధన్ తన షాపు వివాదంపై స్పష్టత రాకపోవడంతో ఒక్కసారిగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఈ ఘటనతో ఖాదీ కార్యాలయంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. షాపు వివాదాన్ని పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుడి సమస్యపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *