Breaking News

మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన బీఆర్‌ఎస్ నేతలు

కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తీవ్ర విమర్శలు

మేడిగడ్డ, నవంబర్ 03 (E6tv న్యూస్).

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి అక్కడి పరిస్థితులను, నీటి లభ్యతను పరిశీలించారు.

ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును ‘కూలేశ్వరం’ అంటూ ప్రచారం చేసి ప్రజల ఓట్లు పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించడంలో ఎందుకు విఫలమవుతోందని ప్రశ్నించారు. నాడు ప్రాజెక్టుపై చేసిన ఆరోపణలకు, నేటి పరిస్థితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఒకవైపు ప్రజలకు నీటిని వృథా చేయవద్దని సూచిస్తూ, మరోవైపు రైతులకు సాగునీరు అందించకుండా పంటలు వేయడం మీ కర్మ అంటూ మాట్లాడటం కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని నిలదీశారు.

తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించాల్సిన బాధ్యతను విస్మరించి, ఇతర ప్రాంతాల ప్రయోజనాల కోసం తెలంగాణ నీటి హక్కులను నిర్లక్ష్యం చేస్తున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత కావాలని స్పష్టం చేశారు.

మేడిగడ్డ వద్ద అందుబాటులో ఉన్న నీటిని సాంకేతిక నిపుణుల సూచనలు, బ్యారేజీ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పంపులు ప్రారంభించి రైతులకు సాగునీరు అందించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని గణేష్ బిగాల కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్నికల సమయంలో చేసిన ఆరోపణలపై, ప్రస్తుత పరిస్థితులపై ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని, తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకు సాగునీరు అందించకపోతే బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సిర్ప రాజు, ప్రభాకర్ రెడ్డి, సత్యప్రకాశ్, సుజిత్ సింగ్, దండు శేఖర్, జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *