నేచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న పాన్-వరల్డ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. చిత్రంలో ఉన్న తీవ్రమైన యాక్షన్ సీన్లు, రక్తపాతం, బోల్డ్ కంటెంట్ కారణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాకు ‘A’ (అడల్ట్) సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే, ఓవర్సీస్ డిస్పాచ్, ప్రమోషనల్ పనుల ఆలస్యం కాకుండా ఉండేందుకు ఫైనల్ కట్ కంటే ముందే రఫ్ కట్ వెర్షన్‌ను పంపి సెన్సార్ అనుమతులు పొందడం గమనార్హం.
మరోవైపు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ రాత్రింబవళ్లు రీ-రికార్డింగ్ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే మొదటి భాగానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పూర్తి కాగా, సెకండాఫ్‌పై వర్క్ చేస్తున్నారు. ఇక సినిమా ప్రమోషన్స్ విషయంలో హీరో నాని ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రానికి ఎలాంటి అధికారిక ట్రైలర్‌ను విడుదల చేయడం లేదని స్పష్టం చేశారు. ట్రైలర్ కట్ చేయడానికి వెచ్చించే 4-5 రోజుల సమయాన్ని సినిమా ఫైనల్ క్వాలిటీని మెరుగుపరచడానికే వినియోగిస్తున్నట్లు నాని వెల్లడించారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

