Breaking News

పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు

తెలంగాణలో త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి సామ రామ్మోహన్ రెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గానికి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం రాత్రి ఈ వివరాలను ప్రకటన రూపంలో విడుదల చేశారు. కాగా, 2027 మార్చిలో ఖాళీ కానున్న ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

మరోవైపు ఈ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల నమోదు ప్రక్రియ సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 1, 2026 నాటికి డిగ్రీ లేదా తత్సమాన డిప్లొమా పూర్తి చేసి మూడేళ్లు పూర్తయిన పట్టభద్రులందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి అర్హులని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఓటు ఉన్నవారు కూడా ఈసారి కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమవ్వడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం తన ఓటును నమోదు చేసుకున్నారు. నవంబర్ 6వ తేదీలోగా అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల సంఘం వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 25న ముసాయిదా జాబితా, డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *